in ,

నేతి గారెలు

తింటే తినాలి గారెలు, వింటే వినాలి మహాభారతం- పెద్దలు ఊరికే అనలేదు.  నేతి గారెలు రుచిగా ఉంటాయి. సంక్రాంతి పండుగ వస్తే చాలు, కనుమ నాడు తప్పకుండా అందరు గారెలు వండుకుంటారు.

మా ఇంట్లో కూడా గారెలు వండేవారు. కానీ మా నాన్న గారు తింటూ, ఇవి ఏం గారెలు? మా అత్తగారు నేతిగారె లేస్తారు. ఎంత బాగుంటాయో ! అనేవారు. అదిగో అప్పుడు మొదలయ్యేది గొడవ.

నాన్న నేతి గారెలుతిన్నాడు, బాగుంటాయి, మాకు అవి కావాలి -అని  గొడవ చేసేదాన్ని. దాంతో మా అమ్మ రెండు చెంచాల నెయ్యి తీసుకెళ్లి, నూనెలో వేసి గారె లేసి పెట్టేది. ఆహా నేతి గార్లు అని, నేను తింటూ ఉండే సమయంలో, నూని ,నెయ్యి కలిపింది, ఇదేంగారెలు,  అంటూ మళ్ళీ మొదలు పెట్టేవారు. మా అమ్మకి కోపం వచ్చి ,మా నాన్నని విసుక్కునే వరకు, ఆయన నేతి గారెల గొప్పలు చెబుతూ ఉండేవారు.

మా తల్లిదండ్రులకు పుట్టి ళ్ళల్లో పాడిపంటలు సమృద్ధిగా ఉండేవి.  పాలలో పుట్టి ,పాలలో పెరిగారు (ఈ మాట మా అమ్మ పాల వాళ్ళతో అనేది.) నేను పుట్టిన దగ్గర్నుంచి, నాకు పిల్లలు పుట్టే వరకు ఒక పదిహేను ఊళ్ళు మారాం. ఇలా ప్రతి ఊరిలోనూ పాల వాళ్ళతో గొడవ పడుతూ ఉండేది.

సొంత పాడి పంటలు ఉన్నవాళ్ళు చక్కగా తాజా తాజా గా మీగడ గడ్డ పెరుగు, తాజా నెయ్యి , రోజూ తింటూ ఉంటారు. మా తాతగారి ఇంట్లో, ఆవులు ,గేదెలు ఉండేవి. సెలవులకు వెళ్ళినప్పుడు, పొద్దున్నే వెన్న తీసి ,కాచి, నెయ్యి చేసేవారు.

వేడి వేడి అన్నంలో, ఈ తాజా నెయ్యి వేసి పెడితే ,కమ్మగా ఉండేది . నెయ్యి కాచినప్పుడు ,అడుగున బ్రౌన్ కలర్ మెటీరియల్ వస్తుంది . దాన్ని గోదారి అంటారు .అందులో పంచదార వేసి పెట్టేవాళ్ళు పిల్లలకి.

పొలాలు ఉండేవాళ్ళు, ఎండుగడ్డి తెచ్చుకుని ,ఇంట్లో గడ్డివాము వేసి,నిల్వ చేసుకుని, ఆవులకి ,గేదె కి వేసే వాళ్ళు. ఎండు గడ్డి తాగిన గేదెల పాలు  చిక్కగా వస్తాయి. పచ్చిగడ్డి పాలు తాగే గేదెలు పల్చని పాలు ఇస్తాయి. ఈ విషయం తెలియక ప్రతి ఊర్లో నూ పాల వాళ్ళతో గొడవలు పడుతూ ఉండేది మా అమ్మ.

అసలే పాలే నీళ్ళ గా వస్తాయి. ఆపైన మీగడ, వెన్న, నెయ్యి ఎక్కడ నుంచి వస్తుంది. దాంతో నోరు మూసుకునే వాళ్ళం. ఏదో మా తృప్తి కొరకు ఓ రెండు గరిటెల నెయ్యి వేసి, మిగతా నూనె వేసి, ఇవే నేతి గారెలు  అని పెట్టేది. కానీ ఆ గారెలు తింటూ, మా నాన్న నేతి గారెలు- అంటూ మొదలు పెట్టేవారు. పెద్దయినాక విషయం అర్థం చేసుకుని, నోరు మూసుకునే దాన్ని. ఎందుకంటే నా పుట్టింట్లో గేదెలు లేవు కదా. కానీ జీవితంలో ఎప్పటికైనా ఒక్కసారి నేతి గారెలు తినాలి, అనేది నా ఆశయం లాగా ఉండేది.

నా ఆశయం కాస్త తీరని కల గా మారిపోయింది. చదువుకోవడం వల్ల కొలెస్ట్రాల్ భయంతో అసలు గారెలే వేయడం తగ్గించాం. మంచి వానాకాలం, పండగ రోజులు, సరే గారెలు చేసుకుందాం అని పప్పు రుబ్బుకున్నా. తీరా చూస్తే నూనె నిండుకుంది. ఇక  ఏమి చేయడానికి తోచలేదు. అప్పుడు నా చిన్ననాటి కల “నేతి గారెలు” గుర్తొచ్చింది.నెయ్యి ప్యాకెట్ ఉంది.

ఒక్క క్షణం ఆలోచించా. వయసును బట్టి కొలస్ట్రాల్ ,తినకూడదు అని. చిన్నప్పుడు దొరకలేదని తినలేదు. ఇప్పుడు ఉన్నా, కొలెస్ట్రాల్ అని తినము. ముసలితనం వచ్చినాక పళ్ళు ఊడిపోతే ఎలా తింటాం? ఇక నా కోరిక ఎలా తీరుతుంది ?కోరికలు తీరకుండా పోతే, మళ్లీ పుట్టి, కోరికలు తీర్చుకోవాలి. ఇప్పుడే దొరకని నెయ్యి, అప్పుడు మాత్రం దొరుకుతుందని గ్యారెంటీ  ఏమిటి? ఒకవేళ దొరికినా, అప్పుడు దాని మీద ఇష్టం పోతే, పుటుక  వ్యర్థం కాదా?

“సాహసం చేయరా డింభకా” అన్నట్లు ,ఏదేమైనా అవని ,కొలెస్ట్రాల్ వస్తే, డాక్టర్ ఉన్నారు ;యోగ ఉంది .ముందైతే తినేద్దాం అని, నెయ్యి ప్యాకెట్ ఓపెన్ చేసి, గారెలు వేసి సుష్టుగా తిన్నాం. మరి నేతి గారెలు రుచిగా ఉన్నాయా అంటే, మా నాన్న ఊరించి నంత రుచిగా అయితే లేవు.గారె తింటూ ఉంటే నెయ్యి వాసన వస్తుంది.అంతే.కానీ నా కల నెరవేరింది.

ఈ మాత్రం దానికి ఎంత జీవితం, ఎంత కాలం వృదా అయ్యిందో కదా అనుకున్నాను.మీకు ఇది చదివిన తర్వాత నేతి గారెలు తినాలి అనిపిస్తే ,తినేయండి.ఈ మధ్య మోకాళ్ళ నొప్పు లకు నెయ్యి మంచిదంటున్నారు.అందుకే మా నాన్నకు మోకాళ్ళు నొప్పులు లేవు.నాకు ఉన్నాయి.

గారెలు తిన్నాక, తప్పకుండా నడవండి, లేదా జిమ్ లో శ్రమించి, కెలోరీలు కరిగించండి. ఎందుకంటే “ఆరోగ్య మే మహా భాగ్యం”.

Report

What do you think?

Comments

Leave a Reply

Loading…

Loading…

0

గాడిద గుడ్డు

పిల్లల్ని విసిగిస్తే…