ఎండపెట్టండి అంటే పప్పులు, బియ్యాలు, వడియాలు కాదు. అయినా ఇది వానాకాలం. అప్పడాలు, వడియాలు ఎండబెడితే తడిచి, బూజు పడతాయి.
మరి ఏవి ఎండబెట్టాలి? చెపుతున్నా, దిల్ కీ టుకడా, మీ కనుపాపలు, మీలాడ్ లాలు-అదేనండి-పిల్లలు.
భలే వారే, పిల్లలేమన్నా వస్తువులా? ఎండబేట్టటానికి అని గుస్సా చేయకండ్రి. సావధానంగా చదవండి.
కరోనా పుణ్యమా అని, పిల్లలు ఇంటిపట్టున ఉంటున్నారు. సంతోషంగానే ఉన్నా, ఆన్ లైన్ క్లాస్ పేర మంచాలు, కుర్చీలు, సోఫాలో కూర్చుని ల్యాపీ, ట్యాబ్లెట్, సెల్ కి అంకితం అవుతున్నారు.
మనలో మన మాట, స్కూల్ కి వెళితే కనీసం వళ్ళు కదులుతుంది. పుస్తకాల బ్యాగ్ మోసి వెన్ను వంగుతుంది. అసెంబ్లీ లో కాస్త ఎండనైనా పడతారు. ఆటస్తలం ఉంటే అప్పుడు మరీ హాయి.
కానీ ఇరవైనాలుగు గంటలూ ఇంటిలో నే కూర్చో వడం. స్కూలువాళ్ళు పిల్లల్ని అపుడపుడు ఎండకి ఎక్స్పోజింగ్ చేయమన్నారు. సరే కదానని మా బుజ్జాయి ని ఎండలో కి తీసుకెళ్ళా.
ఆహా ఇక నా పాట్లు దేవుడికి ఎరుక. టాప్ టు బోటమ్ బట్టలు కవరింగ్ చేస్తున్నాయి. షర్టు చేతులు పైకి ఎత్తి,కింద ప్యాంట్ మడతపెట్టా వంగుని. పైకి లేచి చూద్దును కదా, షర్టు చేతులు కిందకి జారిపోయినవి. వాటిని మళ్ళీ పైకి మడత బెట్టి, కిందకు చూడగా, ప్యాంట్ మడత జారిపోయింది.
మళ్ళీ వంగుని ప్యాంట్ మడత పెట్టి, పైకి లేచే టప్పటికి చేతులు జారిపోయి నవి. మధ్యలో వెధవ(వెయ్యేళ్ళు ధనం తో వర్ధిల్లరా) డ్యాన్స్ చేస్తాడు. కాళ్ళూ, చేతులు కదుపుతూ. అమాయకురాలిని, నాకేం తెలుసు వేడిగా ఉందని, వాడు ఊపి, మడతలు జార్చుతున్నాడని. ఆ విషయం అర్ధం అయ్యేటప్పటికి నా నడుం కి బాగా ఎక్సర్ సైజ్ అయ్యింది.
విషయం అర్ధం అయినాక, వాడి చేతులు పట్టుకుని, కాళ్ళు కదలకుండా అదిమిపెట్టా. వాడేమి తక్కువ తిన్నాడా. నా నీడలో దాక్కుని, నన్ను ఎండకి బెట్టాడు. మొత్తానికి తల్లీ కొడుకులిద్దరం బాగా ఎండాము.
అసలు ఈ సోదంతా ఎందుకంటే, సూర్య కాంతి లో శరీరం “డి” విటమిన్ తయారు చేసుకుంటుంది. కళ్ళు సూర్య కాంతి లో కొద్దిగా, డి విటమిన్ తో ను చూపును మెరుగు పరుచుకుంటుంది.
స్ర్కీన్లు చూసిన కళ్ళ కు సూర్య కాంతి వలన చూపు మెరుగవుతుంది. అంతే కాదండోయ్,డిప్రేషన్ కూడా తగ్గుతుంది. పిల్లలకు డిప్రెషన్ ఏం టి అంటారా. మరి స్కూల్, టీచర్లు, ఫ్రెండ్స్-అందర్నీ ఫిజికల్ గా మిస్ అవుతున్నారు. ఆ ఎఫెక్ట్ తప్పకుండా ఉంటుంది కదా. అదే డిప్రెషన్.
ఇన్నాళ్లు అమ్మా, స్కూల్ కి వెళ్ళ నే అని ఏడిచేవాళ్ళు, ఇకపై అమ్మా స్కూల్ కి పంపవే-అని వేడుకునే రోజులు వస్తాయి. పెరిగే పిల్లలు, ఎముకలు దృఢంగా, బలంగా, పొడవుగా మారాలంటే సూర్యకాంతి అవసరం. అందుకని పిల్లల్ని ఎండబెట్టండి. పనిలో పనిగా మీరు ఎండండి.
కరోనా నుండి రక్షణకు కావలసిన ఇమ్యూనిటీ కూడా సూర్య కాంతి లో మెరుగు పడుతుంది. అందుకని ఇంటిల్లిపాదీ ఎండండి.
Comments
Loading…
Loading…