రాఖీ అబ్బాయిల పండుగా? అమ్మాయిలు కట్టుకోకూడదా?
అసలు రాఖీ మొదలైనదే రక్ష కోసం. యుద్దాలకు వెళ్ళేవారికి జయం కలగాలని, ప్రార్ధించి, రక్షణ గా కట్టేవారు. తర్వాత అర్ధం మారి అన్నదమ్ముల కు, అక్కాచెల్లెళ్ళ కు అనుబంధం గా మారింది.
ఏది ఏమైనా ఉద్దేశం మాత్రం ఒకటే. కట్టేవారు రక్షణ కావాలని, అంతా శుభం కలగాలని కడితే, కట్టించుకున్న వారు జయం కలగాలని, రక్షిస్తామని అనుకుంటారు.
మరి అన్నదమ్ములు అండగా ఉంటారు-అని ఆడపిల్లలు రాఖీ కడతారు. కానీ ఈ కాలం ఆడపిల్లల తీరే వేరు. అక్కాతమ్ముడు ఉన్న ఇంట్లో, సమానత్వం హక్కు గురించి బాగా తలకెక్కిన కూతురు, నాకు తమ్ముడు రాఖీ కడితేనే, నేను కడతా అంటూ భీష్మించుకుంది.
పాపం తులాలగ్నంలో పుట్టిందేమో, అన్నీ రూల్స్ మాట్లాడుతూ, సమానత్వం పాటిస్తుంది. తల్లి అన్ని రకాలుగా నచ్చ చెప్పింది. చివరకు వరలక్ష్మీ వ్రతం నాడు, నీకు చేతికి పూలతో ముడి వేసిన తోరణం కట్టా కదా. అది నీకు రాఖీ,ఇది తమ్ముడికి అని.
మరి అపుడు తమ్ముడికి పూల తోరణం కట్టాలి కదా అని ధర్మసందేహం లేవ దీసింది. లాభం లేదని, రాఖీ పండుగ గురుంచి మొత్తం వివరించింది తల్లి.
అంతా విన్న కూతురు, మరి తమ్ముడిని నేనే చేయి పట్టుకొని క్లాస్ లో దింపుతా. వాడిని ఎవరైనా , ఏమన్నా అన్నా, నేను వాళ్ళ పని పడతా, వాడిని నేనే రక్షిస్థున్నాను, కాబట్టి వాడే నాకు కట్టాలి అని.పాయింటే.
కానీ ఉన్నది ఒకటే రాఖీ. కూతురికి కడితే కొడుకుకో. పాపం తమ్ముడు మధ్యేమార్గంగా ఉపాయం చెప్పాడు. మొదట అక్కకి కడతా. తర్వాత నేను కట్టించుకుంటా. ఏ కళ్ళ నుందో కూతురు, ఒప్పుకుంది.
మొదట తమ్ముడితో రాఖీ కట్టించుకుని, తర్వాత విప్పి తమ్ముడికి కట్టింది. మొత్తానికి ఈ విధంగా రాఖీ పండుగ ను సమానత్వం తో పాటించింది. ఇది మొదలు, ప్రతీ సంవత్సరం ఆతల్లి రెండు రాఖీలు కొని, ఇద్దరికీ ఇస్తుంది, కట్టుకోమని.
మరి ఆడవాళ్ళకి రాఖీ కట్టవచ్చునా అని సందేహం వస్తుంది. తెలంగాణాలో కొంత మంది అమ్మాయిలు రాఖీ కట్టుకుంటారు. వారికి, ఆడపడుచు కడుతుంది. అన్నకు పెళ్ళైతే, అన్నతో పాటు, వదినకు, రాఖీ కడతారు.
అధికారం లో ఆడవారున్నపుడూ, వారికి రాఖీ కడుతున్నారు.మరి చిన్నపిల్ల ముచ్చట పడితే, తమ్ముడికి లేని బాద మనకెందుకు?
కాని రాబోయే కాలంలో సోదరీమణులందరూ, మాకూ రాఖీ కట్టమని అడిగితే,సోదర్లు సిద్దం గా ఉండాలి.ఎందుకంటే ఆడపిల్లలు ఆకాశం లో సగం. అంతా సమానం. వారి (సమానత్వ హక్కును) ని రక్షించడం సోదరుడి బాధ్యత. కాదనగలమా.
Comments
Loading…
Loading…