ఎవరినైనా కాలుస్తారు లేదా పూడుస్తారు. కానీ “కాల్చేసి పూడ్చేసినారు” అనడం లో కధాకమామిషు వివరిస్తాను.
మానాన్న గారికి తిరుపతి కి బదిలీ అయ్యింది. అక్కడి వాతావరణం, పద్దతులను గురించి వాకబుచేస్తున్నారు. అక్కడినుండి వచ్చి న వారు, చెప్పిన మాటే “ఈ కాల్చేసిపూడ్చేసినారు”.
మేము తిరుపతి వెళ్ళాలి, మా చుట్టాలింటికి బస కొరకు వెళ్ళాం. ఇంటికి తాళం ఉంది. పక్కవారిని అడిగితే, నిన్నే “కాల్చేసి పూడ్చేసినారు”అన్నారు. ఆ మాట విని మొదట బాధపడ్డా, ఏదో సందేహం. ఎవరినైనా కాలుస్తారు లేదా పూడుస్తారు. రెండూ చేయరు. అయినా ఫ్యామిలీ ఉండాలి కదా అని అడిగాము.
దాంతో అతను, అందరూ కాల్చేసి, పూడ్చేశారు అన్నాడు. మా సందేహం బలపడింది. అతన్ని వివరంగా అడిగి, మేము అర్ధం చేసుకున్న దేమిటంటే, వాళ్ళు నిన్న ఇల్లు ఖాళీ చేసి, వెళ్ళారు.
తెలుగు, తమిళం మిక్స్ చేసి మాట్లాడతారు. కాల్చేసి-ఖాళీచేసి-తెలుగు.
పూడ్చేసి-పూడ్సినారు-తమిళం-వెళ్ళారు. రెండు కలిపి కొద్దిసేపు మమ్మల్ని గాబరా పెట్టారు. మబ్బుల్ని -మోడాలంటారు. -ఇలా కొన్ని విషయాలు చెప్పారు.
మేము స్కూల్ నుండి వస్తూ పెన్ను కొనుక్కో వడానికి షాపుకు వెళ్ళాం.పెన్నులున్నాయండీ, ఒకటి ఇస్తారా-అని మర్యాదాగా అడిగాము.
గయ్యి మంది. ఏం నీ కన్నా పెద్ద దాన్ని, అక్కా అనలేవా? అని.
నాకేం ఖర్మ? పక్కనే మా అక్క ఉంది. పరాయి దాన్ని అక్కా అని ఎందుకు అనాలి? అవసరం మాది. అందుకని, కోపం అణుచుకుంటూ, అక్కా, పెన్ను లిస్తావా?అని అడిగా.
అదీ అలా అడగాలీ. పేనా తీసుకో అని ఇచ్చింది. ఇంటికొచ్చి అమ్మా,నాన్నకు చెపితే, మా అమ్మ., పాలవాడు నన్ను అక్కా అన్నాడు, అంది.
కూరలమ్మే అమ్మాయి వచ్చి, మా నాన్న ను అన్నా,కూరలు కావాలా? అని అడిగితే, మాకు నవ్వాగలేదు.
మొత్తానికి అక్కడ ఒకరినొకరు అక్కా, అన్నా, తమ్మి అని సంబోధిస్తారు. ఆ ఊరు విడిచి వచ్చాక గాని మాకు వారి సంప్రదాయం అర్థం కాలేదు.
పరాయి వారిని, సొంత అన్న, తమ్ముడు, చెల్లి, అక్క గా భావించి, సౌభ్రాతృత్వం తో ప్రవర్తిస్తారు. ఇదే సౌభ్రాతృత్వం దేశమంతా ఫరిడవిల్లితే, దిశ లాంటి ఘోరాలు జరగవు.
యత్ర నార్యస్తు పూజ్యతే తత్ర రమంతా దేవతాః.
అందుకనే శ్రీ వేంకటేశ్వర స్వామి తిరుమల గిరుల మీద వెలసినారు కాబోలు.
Comments
Loading…
Loading…