in ,

ఆడవారు సిగరెట్ తాగొచ్చా?

బీసీల కాలంలో ఉన్నాను, అందుకే ఆడవారు సిగరెట్ తాగొచ్చా అని హెడ్డింగ్ పెట్టాననుకుంటారేమో. పబ్ లోకి వెళ్ళి, చక్కగా మందుకొట్టి, డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుబడి, పోలీస్ లమీద జులుం ప్రదర్శించే అందమైన భామల గురించి పేపర్లో రోజూ చదువుతూ ఉంటాను.

మరి సందేహం ఎవరికి వచ్చింది అంటే, మా బుజ్జోడికి. ఒకానొక సాయంత్రం వేళ పని మీద బుజ్జోడిని వెంట పెట్టుకొని బయటకు వెళ్ళా. ఒక వీధిలో, అపార్ట్ మెంట్ ముందు, ఆఫీస్ స్టాఫ్ టీ బ్రేక్ ఎంజాయ్ చేస్తున్నారు.

టీలు, పకోడీలు కంప్లీట్ చేసి, సిగరెట్ తాగుతూ ఉన్నారు. స్టాఫ్ అంటే స్టాఫ్. ఆడా, మగా భేదం ఉండదు. ఖర్మకాలి, అందులో ఒక అమ్మాయి, సిగరెట్ తాగుతూ, ఏదో డిస్కస్ చేస్తుంది. మా బుజ్జోడికి డౌటు వచ్చింది.

మా ఇంట్లో మగవాళ్ళే సిగరెట్, మందు తాగరు. అలాంటిది, నడిరోడ్డుపై, ఆడపిల్ల తాగడమా?. ఇక వాడు”అమ్మా! ఆడపిల్ల సిగరెట్ తాగొచ్చా?” అని అడిగాడు.

అడకత్తెరలో పోక చెక్కలా ఉంది నా పరిస్దితి. ఆడవాళ్ళు ఇప్పటి వరకు అణచివేయబడ్డారు. ఇప్పుడిప్పుడే సమాన హక్కులు పొందుతున్నారు. కొందరు దాన్ని దుర్వినియోగం చేస్తున్నారు.

పిల్లలు సున్నితమైన, స్వచ్ఛమైన మనసు కలిగిన వారు. తల్లి ఏమి చెపితే అదే గుడ్డిగా నమ్ముతారు. ఆడవారు, తాగకూడదు అంటే అణచివేత, అసమానత్వం. తాగొచ్చు అంటే మరి నీవెందుకు తాగలేదు -అనే ప్రశ్న వస్తుంది. ఇటువంటి సమయాల్లో సాధారణంగా ఒక కేక వేసి, సంభాషణ ముగిస్తారు. దాంతో పిల్లలకు కుతూహలం పెరిగిపోతోంది. దాంతో ఆశక్తి రేగి, చాటు, మాటు వ్యవహారం మొదలవుతుంది.

అందుకే నేను వాడి కి చక్కని ప్రశ్నలు వేసి, వాడి నుంచి సమాధానం తెప్పించాను. మరి ఆ ప్రశ్నలు ఏమిటంటే?—-

ఆడవారు గాలి పీల్చుకుంటారా, మగవారు మాత్రమే పీల్చుకుంటారా. వాడు ఇద్దరూ గాలి పీల్చుకుంటారు అన్నాడు.

ఆడవారి కి ఆకలి వేయదా. మగవాడే అన్నం తింటారా? అని అడిగాను. దానికి వాడు-ఆడ ,మగ-ఇద్దరికి ఆకలి వేస్తుంది. ఇద్దరూ అన్నం తింటారు-అన్నాడు.

జీనుప్యాంట్ ఆడవారు వేసుకోకూడదా?అని అడిగితే, వేసుకోవచ్చు అన్నాడు.

అప్పు డు ఆడవాళ్ళు సిగరెట్ తాగొచ్చా,లేదా?అని అడిగితే, తాగొచ్చు అన్నాడు. సో వాడి బుర్రలో ఆడవారు , మగవారు సమానమే అనే అంకురం మొలకెత్తింది.

కాని అంకురానికి చీడపట్టకుండా మందు వేయాలి. అందుకని నేను ప్రశ్నలు వేయడం మొదలెట్టాను. సిగరెట్ తాగితే తప్పా? అని అడిగా. తప్పుకాదు-అన్నాడు.

మరి మనం తాగుదామా? ప్రశ్నించా.

ఛీ వద్దు. లంగ్స్ పోతాయి.కేన్సర్ వస్తుంది-అని చెప్పాడు.

కరెక్ట్. ఆడవారికి గర్భసంచి ఉంటుంది, పిల్లలను గర్భంలో మోయాలి. వారు సిగరెట్ తాగితే, పిల్లలు పుట్టడం లో ఇబ్బందులు వస్తాయి. అందుకని ఆడవారు సిగరెట్ తాగరు. కాని స్వేచ్చ, స్వాతంత్ర్యం ను దుర్వినియోగం చేస్తున్నారు. అందరూ కాదు. కొంత మంది.

సరే నీకు సిగరెట్ తాగాలంటే నాకు చెప్పు. నేను కొనిపెడతా, దొంగతనంగా మాత్రం తాగొద్దని ఓపెన్ ఆఫర్ చేశా.

ఛీ. నువ్విచ్చినా, నేను తాగను అన్నాడు, కోపంగా. అంతకన్నా నాకు కావాల్సింది ఏముంది?

ఇక్కడ మా గురువు గారి గురించి చెప్పాలి. ఆయన చిన్నప్పుడు స్నేహితుల సావాసంలో, దొంగతనంగా ధూమపానం చేశారట. వారి గురువు దగ్గరకు పిలిచి , దొరతనం గా ధూమపానం చేయి, కాకపోతే నోటినిండా పట్టినన్ని సిగరెట్లు పెట్టు కుని, ఒకేసారి కాల్చాలి. అన్నీ కాలిస్తే, జీవితాంతం, ధూమపానం చేయవచ్చు, అన్నారట.

సిగరెట్లు తెప్పించి, నోటి నిండా కుక్కి, వెలిగించారట. పాపం శిష్యుడు ఉక్కిరిబిక్కిరి అయి, విరక్తి కలిగి ఇక జీవితంలో దాని జోలికి పోలేదు.

పిల్లలు చెడుకు త్వరగా ఆకర్షితులవుతారు. చిన్న నాటి నుండి వారికి మంచి చెడులు వివరించి, మంచి వైపు మళ్ళించి, చెడుపై విరక్తి కల్గించాలి. దానికి తల్లి, తండ్రి, గురువు, తోడబుట్టిన వారు భాద్యత వహించాలి.

Report

What do you think?

50 Points
Upvote Downvote

Comments

Leave a Reply

Loading…

Loading…

0

నానావతి కేసు

దెయ్యాల గ్రామం